పొద్దుటూరులో సీడీ షాపులపై పోలీసుల దాడులు
పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు
ప్రొద్దుటూరు క్రైం: విడుదల కంటే ముందే సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రం లీకైందంటూ పుకార్లు వినిపించాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు బుధవారం ఉదయం నుంచి దాడులు చేశారు. పవన్‌కల్యాణ్ నటించిన సర్దార్‌గబ్బర్‌సింగ్ ఈనెల 8న విడుదల కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన సీడీలు మార్కెట్‌లోకి విడుదలయ్యాయనే సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాలకు అందింది. దీంతో రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారుల సమాచారం మేరకు ప్రొద్దుటూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు సీడీ షాపులు, తయారీ దారులపై పోలీసులు దాడులు నిర్వహించారు.
ఈ చిత్రానికి పని చేసిన కొందరు టెక్నీషియన్ లు రెండు రోజుల క్రితం ల్యాబ్ నుంచి కాపీ చేసుకున్నట్లు పుకార్లు వినిపించాయి. ప్రొద్దుటూరులోని పలు సీడీ షాపులలో పోలీసులు సోదాలు చేశారు. సీడీలను తయారు చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్న దుకాణాలపై కూడా దాడి చేసి హార్డ్ డిస్క్‌లు, సీడీ రైటర్‌లను పరిశీలించారు. టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరిని, త్రీ టౌన్ పరిధిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ మేరకు వారిని బైండోవర్ చేసి తహ సీల్దార్ వద్ద హాజరుపరిచారు. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితులను చిత్రం విడుదల అయ్యే వరకూ ప్రతి రోజూ స్టేషన్‌లో హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. అయితే సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రానికి సంబంధించిన సీడీలు ఎవరి వద్ద దొరకలేదని పోలీసులు తెలిపారు. దీంతో అభిమానులతో పాటు థియేటర్ యజమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. Source:సాక్షి దినపత్రిక
Post a Comment