Halloween Costume ideas 2015
[ads-post][random][list]

సెల్ఫి ల మోజులో ప్రాణం మీదికి తెచ్చుకొంటున్న జనాలు



‘సెల్ఫీ’సైడ్స్!
అత్యుత్సాహంతోనే ప్రమాదాలు
ఇతరులకు ఇబ్బందిగా మారుతున్న వైనం

సెల్ఫీ సరదా... సాహసాలకు ఉసిగొల్పుతోంది.

అసాధారణ పనుల వైపు నడిపిస్తోంది. ఆ వెనుకే మృత్యువును పంపిస్తోంది. నిండు ప్రాణాలను బలిగొంటోంది. సూసైడ్స్ (ఆత్మహత్యలు)... తరహాలోనే ‘సెల్ఫీసైడ్స్’ పెరుగుతున్నాయి. ఈ ‘సరదా’కు బానిసలైన యువత అధిక సంఖ్యలో మృత్యువాత పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

సిటీబ్యూరో: సెల్ఫీ... ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన సెల్‌ఫోన్ ఆధారిత ఫొటో. దీని కోసం ప్రత్యేక సెల్‌ఫోన్లు, స్టిక్స్‌తో పాటు కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ నాణానికి ఒకవైపు. మరోవైపు సెల్ఫీలు తీసుకునే ప్రయత్నాల్లో అనేక మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సూసైడ్స్ (ఆత్మహత్యలు) తరహాలోనే ఇటీవల ‘సెల్ఫీసైడ్స్’ అధికమయ్యాయి. మంగళవారం జూ పార్క్‌లో సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో బండపై నుంచి కాలు జారి పడటంతో జియాగూడ వాసి మంజీత్ చౌదరి కన్నుమూశాడు. సెల్ఫీ క్రేజ్‌తో పాటు ఈ తరహా ప్రమాదాలూ పెరిగిపోతున్నాయి. అమెరికాకు చెంది న ప్రముఖ పత్రిక వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం 2015లో ప్రపంచ వ్యాప్తంగా 27 సెల్ఫీ సంబంధిత దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిలో సగానికి పైగా భారత్‌లోనే నమోదైనట్లు ఆ పత్రిక స్పష్టం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

యువతలోనే అధికం

సెల్‌ఫోన్లలో ఫ్రంట్ కెమెరాలు  అందుబాటులోకి రావడం... అవీ మంచి రెజుల్యూషన్‌తో కూడినవి కావడంతో సెల్ఫీ క్రేజ్ మొదలైంది. అనేక మంది ప్రముఖులు సైతం బహిరంగంగా సెల్ఫీ తీసుకుంటున్న ఫొటోలకు మీడియా పతాక స్థాయిలో స్థానం కల్పించడం ఈ క్రేజ్‌కు ఆజ్యం పోసింది. సెల్ఫీలపై మోజు చూపిస్తున్న వారిలో అధికశాతం యువతే. తాము ఉన్న ప్రాంతం, పరిస్థితులు, ప్రభావాలను పట్టించుకోకుండా సెల్ఫీలు దిగడానికి ఆరాట పడుతున్నారు. వాహనాలు నడుపుతూ ఫోజులిస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు.

ఏ మీడియా లో చూసినా అవే..

ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలు ప్రాచుర్యం పొందిన తర్వాత సెల్ఫీ ఫీవర్ మరింత ఎక్కువైంది. వీటిలో కొన్నాళ్ల క్రితం ఎదుటి వారు తీసినవో.. తాము తీసిన ఫొటోలనో అప్‌లోడ్ చేసుకునే వారు. సెల్ఫీ మూడ్ పెరగడంతో సోషల్ మీడియాలో ఎవరి ప్రొఫైల్ ఫొటోచూసినా... అప్‌లోడ్ చేసిన ఫొటోలు పరిశీలించినా సగానికి సగం ఇవే కనిపిస్తున్నాయి. ఒకరిని చూసి మరొకరు ఈ బాట పడుతున్నారు. ఈ ధోరణి వారితో పాటు ఇతరులకూ ఇబ్బందికరంగా మారిన సందర్భాలు ఎన్నో ఉంటున్నాయి.

నో పార్కింగ్ తరహాలో...

జనాల్లో... ముఖ్యంగా యువతలో మితిమీరిపోతున్న ఈ సెల్ఫీ పిచ్చి ప్రభుత్వ విభాగాలకూ కొత్త తల నొప్పులు తెచ్చి పెడుతోంది. ఈ నేపథ్యంలోనే ‘నో పార్కింగ్’ ప్రాంతాల తరహాలో మహారాష్ట్రలో ‘నో సెల్ఫీ’ ప్రాంతాలు అమలులోకి వచ్చాయి. గత ఏడాది మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిన కుంభమేళాలో సెల్ఫీ ప్రియులతో అనేక ప్రాంతాలు బాటిల్‌నెక్స్‌గా మారిపోయి ఇతరులకు ఇబ్బందులు కలిగించాయి. ఆ ప్రాంతాలను దాటి వెళ్లడానికి భక్తులు ఇబ్బందులు పడ్డారు. దీంతో కుంభమేళాను అధికారులు ‘నో సెల్ఫీ జోన్’గా ప్రకటించాల్సి వచ్చింది. ‘సెల్ఫీ’సైడ్స్ నిరోధానికి ముంబై పోలీసులు ఆ నగరంలోని 16 ప్రాంతాలను ‘నో సెల్ఫీ జోన్స్’గా ప్రకటించారు. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేశారు.

దేశవ్యాప్తంగా సెల్ఫీ దుర్ఘటనల్లో కొన్ని...

మధ్యప్రదేశ్‌లోని ఓ మూసివేసిన బొగ్గు గని సమీపంలో సెల్ఫీ తీసుకునే ప్రయత్నాల్లో 14 ఏళ్ల బాలుడు అందులో పడి మరణించాడు. చెన్నైలో వేగంగా దూసుకు వస్తున్న రైలు ముందు నిల్చుని సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో 17 ఏళ్ల యువకుడు రైలు ఢీకొని చనిపోయాడు. ఇదే తరహాలో సెల్ఫీకి ప్రయత్నించి ముగ్గురు విద్యార్థులు చనిపోయిన ఘటన మధుర సమీపంలోని కోసికలలో చోటుచేసుకుంది.ముంబైలోని బాంద్రా బస్టాండ్‌లో స్నేహితులతో కలిసి సెల్ఫీ తీసుకుంటున్న మహిళ కాలుజారి బస్సు కింద పడి కన్ను మూసింది.  ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ వద్ద సెల్ఫీ ప్రయత్నాల్లో ఉన్న జపాన్ దేశ పర్యాటకుడు ఎత్తు నుంచి పడి తలకు గాయమై మరణించాడు. ముంబైలోని బాంద్రా-ఓర్లీ సీ లింక్ వంతెనపై సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ముగ్గురు యువకులు సముద్రంలో పడి అశువులు బాశారు.

సెల్ఫీకి ముందు ‘సప్త ప్రశ్నలు’
సెల్ఫీ ప్రమాదభరితం కాకూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సెల్ఫీ తీసుకోవడానికి ఉపక్రమించే ప్రతి ఒక్కరూ... దానికి ముందు ఈ ప్రశ్నలకు సమాధానం వెతకాలని కోరుతున్నారు. అలా చేస్తే ఇది తీపిగుర్తుగా మిగులుతుందని స్పష్టం చేస్తున్నారు. ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్నలు, అవి వర్తించే ప్రాంతాల్లో కొన్ని ఇలా...

సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రాంతాల్లో అసలు ఫొటోగ్రఫీకి అనుమతి ఉందా?
(మ్యూజియాలు, కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు, విద్యా సంబంధ వ్యవహారాల్లో)
సెల్ఫీ కారణంగా నాకు, నా చుట్టు పక్కల వాళ్లకు ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందా?
(జూ పార్కులు, థీమ్ పార్కులు, జనసమ్మర్థ ప్రాంతాలు, మాల్స్, సబ్‌వేస్, విమానాశ్రయాలు, వాహనాలు నడుపుతూ)
సెల్ఫీ తీసుకుంటూ నేను ఎదుటి వారు చూస్తున్న వాటి కి అడ్డం వస్తున్నానా? ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తున్నానా?
(థీమ్ పార్కులు, సినిమా హాళ్లు, సందర్శనీయ ప్రాంతాలు, కొన్ని కార్యక్రమాలు)
సెల్ఫీ తీసుకునే ప్రయత్నాల్లో మరో వర్గానికి చెందిన వారి మనోభావాలు దెబ్బ తీస్తున్నామా?
(మత సంబంధ ప్రాంతాలు, ప్రార్థనా స్థలాలు)
సెల్ఫీ తీసుకుంటున్న ప్రాంతంలో కంటికి కనిపించని ముప్పు పొంచి ఉందా?
(జూ పార్క్‌లు, జాతీయ పార్కులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎత్తయిన భవనాలు/ప్రాంతాలు, ఓడలు, సబ్ వేస్, కదులుతున్న వాహనాలు, రహదారులు)

సెల్ఫీ తీసుకోవడం సమంజసమేనా?
(ప్రమాదం జరిగిన ప్రాంతాలు, అంతిమ యాత్రలు)
నేను తీసుకుంటున్న సెల్ఫీ ఇతరులకు అభ్యంతరం అవుతుందా? (పార్టీలు, రెస్ట్‌రూమ్స్ సమీపంలో, బీచ్‌ల్లో)

తాత్కాలిక ఆనందం కోసమే..
సెల్ఫీ క్రేజ్ తాత్కాలిక ఆనందం కోసం ఏర్పడిందే. ప్రధానంగా యువత తాము ఏదో సాధించామని చెప్పుకునే ప్రయత్నాల్లో భాగంగా మారిపోయింది. ఈ ఫొటోల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఒక్కోసారి ప్రాణాల మీదికీ తెస్తున్నాయి. వీటి కారణంగా భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులు వారికి పట్టట్లేదు. ఇవి ప్రత్యక్షంగా ప్రమాదాలకే కాకుండా పరోక్షంగా సైబర్ క్రైమ్‌కు కారణమవుతున్నాయి. యువతులు పోస్ట్ చేసిన సెల్ఫీలను గమనిస్తున్న సైబర్ పోకిరీలు వాళ్లు వెళ్లిన, వెళ్తున్న ప్రాంతాలను స్పాట్ చేయడం, వేధింపులు, బ్లాక్‌మెయిల్స్‌కు దిగడం జరుగుతున్నాయి.     - పి.రాజు, ఇన్‌స్పెక్టర్, సైబర్‌క్రైమ్ ఠాణా                               Source:సాక్షి దినపత్రిక
Labels:

Post a Comment

Todywindow

{facebook#https://www.facebook.com/} {twitter#https://twitter.com/} {google-plus#https://plus.google.com}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget